జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?
ఇంట్లో పిల్లాడికి జ్వరం రాగానే తల్లిదండ్రులకు ఉండే కంగారు ఒక డాక్టర్ గా మరియు ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులకు మొదట వచ్చే సంశయం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా లేక కొంత సమయం వేచిచూడాలా అని. అందుకే ఎప్పుడు ఇంట్లో చూసుకోవచ్చు ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అన్న విషయం తెలిసి ఉండటం తప్పనిసరి. పిల్లల్లో జ్వరం తో తల్లిదండ్రులకు చాలా కంగారు ఉన్నప్పటికీ, అందులో చాలామందికి ఇంట్లోనే సురక్షితంగా వైద్యం చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో పిల్లలకి ఎప్పుడు ఇంట్లో వైద్యం చెయ్యవచ్చు ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో నుదురు, పొట్ట, అరిచేతులు,పాదాలు వెచ్చగా ఉండటం సహజం, దానినే జ్వరం అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. పిల్లాడి ఉష్ణోగ్రత/temperature 100° F లేదా 38° C కంటే ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్లు. ఇంట్లోనే ఉంటూ, చూడగలిగే/ చికిత్స చేయగల జ్వరం : జ్వరం అనేది వ్యాధికి వ్యతిరేకంగా శరీరం చేసే పోరాటం. ఇది ఒక లక్షణం, ఒక వ్యాధి కాదు.జ్వరం ఉన్నప్పుడు పిల్లలు నీరసంగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత 103...