మా బాబు/పాపకి ఆకలి లేదు, సరిగా తినటం లేదు! ఆకలి పెరగటానికి మందులుంటాయా? dietary advice for toddlers
మా బాబు/పాప సరిగా తినటం లేదు…!
మా బాబు బరువు పెరగట్లేదు, సన్నగానే ఉంటున్నాడు, మా పాపకి ఆకలి ఉండదు, ఎప్పుడు ఆటపైనే ధ్యాస, మా పాపకి పాలు తప్ప ఇంక ఏ ఆహరం ఇష్టం ఉండవు, ఏం చేయమంటారు? ఏవైనా మందులు ఉంటే ఇవ్వండి.ఇది ప్రతీరోజు పిల్లల డాక్టర్లు వినే సమస్య.
పిల్లలు సరిగా తినకపోవటం నూటికి తొంభై శాతం మంది తల్లులను పీడించే సమస్య. తొమ్మిది నెలల వయస్సు నుండి నాలుగో సంవత్సరం వచ్చేవరకు ఎదో ఒక సమయం లో మీ పిల్లలు ఆహరం తినటానికి మారం చేయటం మొదలుపెడతారు. కొంత మంది పిల్లలకు ఈ సమస్య చాలా సంవత్సరాలు ఉంటుంది.
మనం ఏ జంతువైనా పిల్లల్లకి బలవంతంగా ఆహారం పెట్టడం చూశామా? మరి మనుషులలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే ఆ లోపం పిల్లల ఆరోగ్యం లో లేదు తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు చేసే గారంలో ఉంది. అది ఎలా సరిచేసుకోవచ్చో కొన్ని సూచనలు ఈ క్రింది వ్యాసంలో వివరిస్తాను.
అసలు సరిగా తినకపోవడం అంటే ఏమిటి?
తల్లి వైపునుండి చుస్తే పిల్లలు ఎంత తిన్నా ఎలా తిన్న సరిపడా తినట్లేదనే అనిపిస్తుంది. దీనిని నిర్వచించడం కష్టం. కాని ఒక డాక్టర్ దృష్టిలో మాత్రం ఎప్పుడైతే పిల్లల బరువు పెరుగుదల ఉండదో లేదా పిల్లవాడువయసుకి ఉండాల్సినంత చురుకుగా లేడో అప్పుడే ఆహారలోపం ఉన్నట్లు.
ఇలాంటి పిల్లలలో ఉండే లక్షణాలు:
1.)తక్కువ ఆహారాన్నే తినడం,
2.)కొత్త ఆహారాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడకపోవడం,
3.)కొన్ని రకాల ఆహారాన్ని మాత్రమే అంగీకరించడం,
4.)ఆహారం కంటే పానీయాలకు/పాలకు ప్రాధాన్యత ఇవ్వడం,
5.)నోట్లో పెట్టిన ఆహారాన్ని బుగ్గన పెట్టుకుని ఎంతసేపైనా మింగకపోవటం.
ఇది చింతించాల్సిన విషయమా?
కాదు, ఎప్పటివరకుఅయితే మీ పిల్లలు వయసుకు తగ్గట్లు చక్కగా ఆడుకుంటున్నారో, ఆవయసుకి ఉండాల్సిన బరువు, ఎత్తు ఉంటారో అప్పటివరకు కంగారు పడాల్సిన అవసరంలేదు.
పిల్లలలో ఈ మార్పు కి కారణం?
- పిల్లలకి మొదటి పుట్టినరోజు తరువాత బరువు పెరగటం మునుపటిలా ఉండదు, సంవత్సరానికి సగటున ఒకటి నుండి మూడు కిలోలు మాత్రమే ఉంటుంది.
- దీనికి తోడు పిల్లలు ఈ వయసులో నడక పరుగు నేర్చుకుంటారు, ఒక చోట కుదురుగా ఉండే పిల్లలు అరుదు. వీటివలన ఆకలి మందగించటం సహజం.
- కొంతమంది పిల్లల చురుకుదనం వలన సన్నగానే ఉంటారు, కొంతమంది శరీరతత్వం వలన అలా ఉంటారు.
- తల్లిదండ్రులలో అవగాహనా లోపం.
- ఏదైనా జ్వరం లేదా అనారోగ్యం నుండి కోలుకున్నాక కొన్ని వారాలపాటు ఆకలి మందగించటం సహజం.
అప్పుడు మనం ఏం చేయాలి?
- పిల్లలు తినే కొద్దిపాటి ఆహారమైనా బలమైన ఆహారం పెట్టటానికి ప్రయత్నించండి,అనగా మొదటి పుట్టినరోజు తరువాత ప్రతీరోజు ఒక పూర్తి గుడ్డు పెట్టచ్చు (తెల్ల సొన మరియు పచ్చసొన),అది ఉడకపెట్టినా పర్వాలేదు లేదా ఆమ్లెట్ లాగా వేసినా పర్వాలేదు. ప్రతీరోజు ఉదయం ఇచ్చే ఆహరం ఇడ్లిలో నెయ్యి వేసి అలవాటు చేస్తే మంచిది. మధ్యాహ్న భోజనంలో పప్పు మరియు నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. పెరుగు మీగడ తీయకుండాకలిపితే బలం ఎక్కువ ఉంటుంది. నెయ్యి మరియు మీగడ వలన జలుబు దగ్గు వస్తాయనుకోవటం ఒక అపోహ మాత్రమే.
- పిల్లల తన / ఆమె ఆకలిని తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వండి. బలవంతంగా టైం ప్రకారం ఆహరంపెట్టకూడదు. పిల్లలు మరబొమ్మలు కాదు ఇంత టైం కి ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి. ఒక్కొక్కరి శరీరతత్వం ఒకలాఉంటుందని గ్రహించాలి.
- పిల్లలకి తమ చేతితో తినటానికి ప్రోత్సహించండి, అప్పుడు ఆహరం మీద ఆసక్తి వస్తుంది.
- పిల్లలకి ఆహారసమయాలు తెలిసేలా చెయ్యాలి, అంటే ఆహారానికి ఆహారానికి మధ్యలో చిరుతిండ్లు ఇవ్వకూడదు, భోజనం సరిగా తినకపోయినా సరే.
- భోజన సమయం ఒక గంట మించకుండా చూసుకోండి, ఆ తరువాత తినకపోయినా వదిలెయ్యండి, అప్పుడే మళ్ళీ ఆకలి తెలియటానికి సమయం ఉంటుంది.
- ఆహారం బలవంతం చేయవద్దు. ఆహారాన్ని లంచంగా ఉపయోగించవద్దు.
- ఆహారం తినేసమయంలో ఫోన్ కానీ టీవీ కానీ చూపించద్దు, కొంతమంది తల్లులకి ఇది కష్టమే కాని ప్రయత్నిస్తే ఒక పది పదిహేను రోజులలో ఫలితం కనిపిస్తుంది. వీలైతే కుటుంబం మొత్తం ఒకేసారి ప్రతీరోజు భోజనం చేయండి, టీవీ లేకుండా. పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు.
- జ్వరం తరువాత కాని అనారోగ్యం తరువాత కాని పిల్లలకి నెమ్మదిగా ఆహరం పెంచాల్సి ఉంటుంది, తొందర పనికిరాదు.
పిల్లలకి పాలు ఏ వయసు వరకూ ఇవ్వాలి?
అన్నిట్టి కంటే కష్టమైన ఇంకా ముఖ్యమైన విషయం, తల్లిపాలు లేదా పాలడబ్బామాన్పించటం. మొదటి సంవత్సరం అయ్యాక తల్లిపాలలో బలం తగ్గిపోతుంది. కాని తల్లిపాలు ఇస్తూ ఉంటే పిల్లలకి ఆహరం మీద ధ్యాస రాదు.పగటిపూట తల్లిపాలు ఎంత తొందరగా మాన్పించగల్గితే మీబిడ్డ ఆకలి అంత త్వరగా పెరుగుతుంది.
డబ్బా పాలవిషయానికి వస్తే అవి పూర్తిగా(పగలు మరియు రాత్రి కూడా) సంవత్సరం నిండగానే మానెయ్యాలి.డబ్బాపాల వల్ల బలం పెరగకపోగా ఆకలి తగ్గటంతోపాటు ఇంకెన్నో అనర్ధాలు ఉంటాయి. వాటి గురించి మరొక వ్యాసంలో వివరిస్తాను.
పాలు ఎంత తాగించాలి, ఎప్పుడు తాగించాలి?
పాలు సంవత్సరం నిండాక కేవలం గ్లాసు(100-150ml) తో మాత్రమే తాగించాలి పాల డబ్బా ఇంట్లో ఉండకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే , అది కూడా భోజనం పూర్తయినతరువాతే పడుకునేముందు ఇవ్వవచ్చు. సంవత్సరం వయసు తరువాత ఇంట్లో అందరూ తాగే పాలే పిల్లలకు ఇవ్వవచ్చు. టీ కాని కాఫీ కానీ పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు.
పాలలో కలిపే హెల్త్ డ్రింక్స్ వాడవచ్చా ?
రెండు సంవత్సరాల(24MONTHS) వయసు లోపు పిల్లలకి ఇవి వాడకూడదు.
ఎలాంటి ఆహారాలు ఇవ్వాలి , ఎలాంటివి ఇవ్వకూడదు?
ఆరు నెలల వయసు నిండినప్పటినుండే మెత్తని పండ్లు తినటం అలవాటు చేయాలి.ప్రతీ రోజూ ఆపిల్ లేదా ఒకేరకం పండ్లు కాకుండా ఏ కాలంలో దొరికే పండ్లు (జామ, బొప్పాయి, అరటి, సపోటా, మామిడి) ఆ కాలంలో ఇస్తూ ఉంటే మంచిది. పిల్లలకి పండ్లరసాలు ఇవ్వటం మంచిది కాదు, వాటి వలన ఆకలి తెలియదు. ప్యాకెడ్ ఫుడ్ ఐటమ్స్(నూడుల్స్, పొటాటో చిప్స్,కేక్, బకెరీ ఐటమ్స్,కూల్ డ్రింక్స్)ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఇవ్వరాదు.
మా బాబు తినగానే విరోచనానికి వెళ్తుంటాడు, అందుకే బరువు పెరగట్లేదా?
తిన్న వెంటనే విరోచనానికి వెళ్ళటం పిల్లలతో ఒక సహజసిద్దమైన గుణం. దీనినే గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్(Gastro colic reflex) అంటారు.దీనివలన ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కొందరు రోజుకి నాలుగు నుండి ఆరుశారు విరోచనానికి వెళ్తుంటారు, తినగానే.
దీనితో పిల్లల బరువుకీ, ఆకలికి ఎటువంటి సంబంధం లేదు. ఇది అరుగుదల సమస్య కాదు. దీనికి వైద్యం అవసరం లేదు.
ఆకలి పెరగటానికీ , అరుగుదలకీ మందులు వాడాలా?
ఆకలి పెరగటానికి నిరూపించబడిన మందులు లేవు, మరియు అరుగుదల మందులు వాడవలసిన అవసరం సాధారణమైన పిల్లలలో ఉండదు.
మరి డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి?
- బాబు లేదా పాప వయసుకి తగ్గ బరువు మరియు ఎత్తు లేకపోయినా,
- వయసుకి చెయ్యాల్సిన పనులు చేయలేకపోతున్నా,
- ఎప్పుడూ నీరసం గా ఉంటున్నా.
- బరువు తగ్గుతున్నా,
- తరచుగా(ప్రతీ నెలా )జ్వరం వస్తున్నా.
- మలబద్దకం ఉన్నా(విరోచనం చాలా గట్టిగా అవ్వటం, రెండు మూడు రోజులకి అవ్వటం)
- పిల్లలు మట్టి లేదా పెయింట్ లేదా సున్నము,బలపం,కాగితాలు వంటి వస్తువులు తింటున్నా.
- తరచుగా కడుపునొప్పి లేదా వాంతులతో బాధపడుతున్నా.
- నులిపురుగులు విరోచనంలో కనిపిస్తున్నా.
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో ఎంత ఎత్తు ఉండాలో, ఏ వయసుకి ఎటువంటి ఎదుగుదల ఉండాలో తెలుసుకోవటానికి మీ పిల్లల డాక్టర్ గారిని సంప్రదించండి లేదా 89199 94819 కి డాక్టర్ గారి సలాహా(Growth charts and developmental assessment) కోసం వాట్సాప్ చేయండి. ఈ విషయంలో ఇంకా సందేహాలు ఉంటె క్రింది కామెంట్స్ లో పెట్టండి, నివృత్తి చేయటానికి ప్రయత్నిస్తాను.
వ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.
ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.
ప్రత్యేకంగా నాకు వీటిలో ఎన్నో విషయాలు తెలియపరచిన డాక్టర్ నోరి సూర్యనారాయణగారికి ఇవి పొందుపరచటం లో సహకరించిన శ్రీలక్ష్మి, డాక్టర్ కీర్తి మరియూ ఎంతోమంది సహా వైద్యులకు కృతజ్ఞతలు. And credit to my brother Krishna Teja Rekapalli for the technical support.
Photo credit- Dr Guru ayyappa ramasingu.
ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ MD(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్(FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ chennai) చేసారు.
Disclaimer: This document cannot be used for any medico-legal purpose.
Dr. Srinivas MD
Thank u so much for ur information...This is very help full to mee,💐🙏
రిప్లయితొలగించండిVery well written.. so much useful information for parents like me, during this covid times. Clarified so many doubts n myths regarding child nutrition and care.
రిప్లయితొలగించండిVery Useful information Sir.. Thank you so much
రిప్లయితొలగించండిThank you very much sir
రిప్లయితొలగించండిThis information is very
Use ful sir
Nice article.. Very informative .. ��
రిప్లయితొలగించండిVery good information sir ,for those who are having first child with no knowledge of child growth
రిప్లయితొలగించండిThank you so much for your information.... this is very helpful to mee...,,,💐
రిప్లయితొలగించండిThank you Sir ... very informative .
రిప్లయితొలగించండి