Part 1 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? మొదటి భాగం. Guide book to help parents with vaccination 1.

ఇది చాలా ముఖ్యమైన సమాచారం,  మరియు తెలియపరచాల్సిన వివరాలు ఎక్కువ ఉండటం వలన రెండు భాగాలుగా విభజించటమైనది.

 టీకాలు అంటే చిన్నపిల్లలని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకే రోజు రెండు మూడు సూదులు పొడిపించాలి, మళ్ళీ వచ్చే జ్వరాన్ని భరించాలి, ఎందుకు పిల్లల్ని ఇంత బాధ పెట్టి మనం ఇబ్బందిపడాలి? తల్లిదండ్రులుగా మన పిల్లలను,  అనారోగ్యానికి గురికాకుండా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేయాలనుకుంటాము .కాని ఈ టీకాలు ఎందుకు వేయించాలి? 

ఇదివరకటి కాలంలో (1960వ దశకంలో) వందమంది పిల్లలు పుడితే అందులో పాతికమంది పిల్లలు ఐదు సంవత్సరాలు నిండకముందే చనిపోయేవారు. అదే సమయంలో మన దేశంలో సగటు మనిషి ఆయుర్దాయం 35 సంవత్సరాలు. మరి ఇప్పుడు? వందమంది పిల్లలు  పుడితే వారిలో 97 మంది ఐదు సంవత్సరాలు దాటుతున్నారు మరియు సగటు ఆయుర్దాయం దాదాపు 70 సంవత్సరాలు.ఈ మార్పులకు   పిల్లలో తప్పనిసరిగా టీకాలు వేయించటం 1980ల లో మొదలుపెట్టటం అతిముఖ్యమైన కారణం. 

మసూచి(small pox) , పోలియోలను పారద్రోలామంటే అది టీకాల వల్లనే. ఇపుడు కూడా COVID 19 టీకా కోసమే కదా అందరి ఎదురుచూపు.


టీకాలు అంటే ఏమిటి?

అనారోగ్యాన్ని నయం చేయడానికి మందులు ఇస్తారు. కానీ టీకాలు వేరు. అనారోగ్యాన్ని నివారించడానికి టీకాలు ఇస్తారు.

పిల్లలు పుట్టినప్పుడే వారిలో కొంత రోగనిరోధకశక్తి ఉంటుంది , ఇంకొంత శక్తి తల్లిపాలద్వారా సంక్రమిస్తుంది.వారి వయసు పెరిగినకొద్దీ ఈ శక్తి పెరుగుతూ యుక్తవయసుకి వచ్చేసరికి బాగా బలపడుతుంది. కాని ఆ వయసుకి వచ్చేలోపు పిల్లలు ఎన్నో క్రిములనుండి అనారోగ్యాలు ఎదుర్కోవలసి ఉంటుంది.వాటిలో కొన్ని ప్రమాదకరమైన జబ్బులతో పిల్లలు పోరాడ లేరు. 

టీకాలు అంటే ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన క్రిముల స్వరూపాన్ని మార్చి వాటిని చాలా కొద్ది మోతాదులో సరిఅయిన వయసులో పిల్లల శరీరాలలోకి ప్రవేశింపచేస్తే వారిలో ఆ క్రిమి పట్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక సారి అది జరిగినతరువాత మరొకసారి ఆ పిల్లవాడు ఆ క్రిమివల్ల వచ్చే జబ్బుని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాడు.

టీకాల గురించిన ప్రాథమిక సమాచారం.

1.) టీకాలు అన్ని వేయిస్తే మా బాబుకి ఇక జ్వరాలు రావు కదా?

అలా కాదు, ఎందుకంటే కొన్నివేల రకాల క్రిములు మనుషులకి సోకే అవకాశం ఉంటే, వాటిలో కొంచెం తరచుగా వచ్చే 16 రకాల క్రిముల నుండి రక్షణకు మాత్రమే ఇప్పటికి టీకాలు అందుబాటులో ఉన్నాయి.

2.) 

3.) టీకాలు పట్టిక(vaccination schedule)  ప్రకారమే వేయించాలా?

ఎంతో పరిశోధన తరువాత ఏవయస్సులో ఏ టీకా వేస్తే అత్యుత్తమ ఫలితం ఉంటుందో ఆ వయస్సు లో తేదీనే పట్టికలో ఇస్తారు. వీలైనంతవరకు అదే తేదీన టీకా వేయించాలి.ఒకవేళ వీలుకాని పక్షంలో ఆ తేదికి తరువాత ఒక వారం రోజులలో వేయించొచ్చు.  కానీ ఇచ్చిన తేదికి ముందు మాత్రం వేయించకూడదు. 

4.)ఒకే రోజున మూడు లేదా నాలుగు టీకాలు వేయించచ్చా?

వేయించచ్చు, మీ పిల్లల డాక్టర్ గారు సూచన మేరకు చెయ్యండి.

5.)పిల్లలకి ఒకవేళ టీకా వేసే రోజుకి ముందు జ్వరం లేదా నలతగా ఉంటే ఏం చెయ్యాలి?

జ్వరం ఉన్నా, పిల్లవాడు నీరసంగా ఉన్న మీ వైద్యుడి సలహా ప్రకారం టీకాలు కొంచం(ఒక వారం) ఆలస్యం గా వేయించచ్చు. కొద్దిపాటి జలుబు దగ్గు కోసం టీకాలు వాయిదా వేయద్దు. 

6.)చాలా వరకు టీకాలు పిల్లల తొడ మీద ఇస్తారు, దానికి వీలైన బట్టలు వేసి తీసుకెళ్లండి. టీకా వేసిన తరువాత ఒక అరగంట హాస్పిటల్ లొ వేచి ఉండండి.

7.)టీకాలు అంగన్వాడి లో లేదా ANM(ప్రభుత్వం) ఇచ్చేవి సరిపోతాయా లేక అదనంగా ఏమైనా వేయించాలా?

సరిపోవు.  ప్రభుత్వం ఇచ్చే టీకాలలో చాలా ముఖ్యమైన జబ్బులకు టీకాలు ఉన్నప్పటికీ మరికొన్నిజబ్బుల నుండి రక్షణ కోసం అదనపు టీకాలు మీ పిల్లల వైద్యుడి వద్ద తప్పకుండా వేయించుకోండి. అవి ఏవి అని క్రింద వివరిస్తాను.

8.) టీకాలు వేయించిన పిల్లలలో ఆటిజం వస్తుందా?

ఇది  విదేశాలలో  ఉండే అపోహ , మూఢ నమ్మకం అని చెప్పచ్చు. టీకాలకు ఆటిజంకు ఎటువంటి సంబంధం లేదని ఎన్నో సార్లు నిరూపించబడింది. దయచేసి ఇలాంటి అపోహలు నమ్మి పిల్లలను టీకాలకు దూరం చెయ్యొద్దు.

8.) ఒక టీకా వేసాక ఆ జబ్బు నుండి రక్షణ రావటానికి కొన్ని రోజుల నుండి వారల సమయం పడుతుంది. కొన్ని జబ్బులకు టీకా మళ్ళీ మళ్ళీ వేస్తే కాని తగిన రక్షణ రాదు, వాటినే బూస్టర్ డోస్లు(Booster doses) అంటారు.

9.) టీకాలు ఎపుడూ ఒక పిల్లల డాక్టర్ లేదా ప్రభుత్వం నియమించిన వ్యక్తీ వద్దనే వేయించండి , టీకాలు ఒక నియమావళి ప్రకారం భద్రపరచి ఉపయోగిస్తేనే పనిచేస్తాయి.

పిల్లల్లో తప్పనిసరిగా వేయించాల్సిన టీకాలు,వాటికి సహజం గా ఉండే దుష్ప్రభావాలు(Side effects) :

పుట్టినప్పుడు వేసే టీకాలు(మొదటి మూడు రోజులలో వెయ్యచ్చు)

1.)BCG- ఇది TB జబ్బునుండి కొంత వరకు రక్షణ ఇస్తుంది. ఇది పుట్టిన మూడు రోజులలోపు ఎడమ చేతికి వేస్తారు. ఇది వేసిన నెల నుండి ఆరు నెలల లోపు ఒక బొడిపె లాగా రావచ్చు, నెమ్మదిగా అది మెత్తబడి కొంత చీములాగా కారచ్చు.ఎటువంటి వైద్యం అవసరంలేకుండా ఇది మాని ఒక మచ్చ ఏర్పడుతుంది. కంగారు అవసరం లేదు.

2.)Hepatitis B( హెపటైటిస్ బి)-  ఇది కూడా పుట్టిన మూడు రోజుల లోపు తొడమీద వేస్తారు. ఇది Hepatitis B  అనే క్రిమి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. పసిపిల్లలో వచ్చే పుట్టు కామెర్లకు ఈ టీకాకి సంబంధం లేదు.

3.) OPV(పోలియో చుక్కలు)- పుట్టిన మొదటి మూడు రోజులలోపు రెండు చుక్కలు వేస్తారు. 

నెలా పదిహేను రోజుల వయసు( లేదా ఆరు వారల వయసు నిండాక) వేసే టీకాలు:

1.) DPT(డీ పీ టి)- ఇది తొడ మీద ఇచ్చే ఇంజక్షన్. ఇది చాలా ముఖ్యమైన టీకా, కోరింత దగ్గు(Pertussis) ,  ధనుర్వతము(Tetanus), కంఠసర్పి(Diptheria)  అను మూడు అతి ప్రమాదకరమైన జబ్బుల నుండి కాపాడుతుంది. ఈ టీకా వేసింతరువాత ఒకటి లేదా రెండు రోజులు జ్వరం మరియు వేసిన తొడ వాయటం, నొప్పిచేయటం ఉంటాయి. వాటికి మీ డాక్టర్ గారు ఇచ్చిన మోతాదులో Paracetmol డ్రాప్స్ లేదా సిరప్ ఆరు గంటలకు ఒకసారి వేయండి. నొప్పి తగ్గాక కూడా వాపు కొన్ని వారాలపాటు ఉండచ్చు, చింతించనవసరం లేదు.

దీనిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి హోల్ సెల్(whole cell) మరొకటి అసెల్లులార్(acellular). హోల్ సెల్ రకం టీకాకి జ్వరం మరియు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. అసెల్లులార్(acellular) రకాన్నే painless/నొప్పి లేని టీకా అని కూడా వాడుక లో అంటారు . ఇది వేస్తె జ్వరం , నొప్పి, వచ్చే అవకాశం తక్కువే కాని కొంత మంది పిల్లలకి ఇది వేసినా కూడా ఒక రోజు జ్వరం, నొప్పి ఉంటాయి. పనితనంతో రెండూ సమానమే. కాబట్టి ఈ రెంటిలో ఏది వేయించాలి అని మీ పిల్లల డాక్టరుగారితో చర్చించి నిర్ణయించుకోండి.

2.) Hib (Haemophilus Influenza)- ఇది తొడ మీద ఇచ్చే ఇంజక్షన్.  ఇది  నిమోనియా మరియు మెదడు వాపుకి గురిచేసే ఒక క్రిమినుండి రక్షణ ఇస్తుంది.

3.) Pneumococcus - ఇది తొడ మీద ఇచ్చే ఇంజక్షన్.  ఇది కూడా నిమోనియా మరియు మెదడు వాపు కి గురిచేసే ఒక క్రిమినుండి రక్షణ ఇస్తుంది. ఈ టీకాలో రెండు రకాలు ఉన్నాయి , మొదటిది Prevenar 13, రెండోది Synflorix. వీటిలో లో కొద్దిపాటి తేడాతో Prevenar 13 కొంత మెరుగు. కానీ మీ పిల్లల వైద్యుని సలహా, మీ స్తోమతను బట్టి ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. మొదటి సారి ఏదైతే ఎంచుకుంటారో తరువాతి డోసులలో కూడా అదే రకం ఇవ్వవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వ టీకాలలో ఇప్పటికి లేదు. మీ  వైద్యుని వద్ద అడిగి మీ పిల్లలకు తప్పక ఇప్పించండి.

4.) IPV (పోలియో ఇంజక్షన్)- ఇది తొడ మీద ఇచ్చే ఇంజక్షన్. ఇది పోలియో చుక్కలకంటే సమర్ధవంతంగా పోలియో జబ్బుని నివారిస్తుంది.

5.) Rotavirus( రోటా వైరస్ చుక్కలు) - ఇది నోటిలో వేసే చుక్కల మందు. ఈ చుక్కలు ఇవ్వటానికి ఒక అరగంట ముందు మరియు ఇచ్చిన అరగంట తరువాత వరకు పాలు ఇవ్వకూడదు. పిల్లలలో విరోచనాలు కలిగించే క్రిములలో రోటా వైరస్ ఒకటి. ఈ టీకా వలన పిల్లలో రోటా వైరస్ వల్లన విరోచనాలు అయ్యే అవకాశం తగ్గుతుంది.

6.) Hepatitis B( హెపటైటిస్ బి)-  రెండవ డోస్.

రెండు నెలల పదిహేను రోజులు లేదా 10 వారల వయసు నిండాక: 

నెలా పదిహేను రోజులకు వేసిన ఆరు టీకాలు ( DPT+IPV+Hepatitis B+HIB+Pneumococcal+Rota virus) మళ్ళి ఇప్పుడు వేయాలి.

మూడు నెలల పదిహేను రోజులు లేదా 14 వారల వయసు నిండాక: 

నెలా పదిహేను రోజులకు వేసిన ఆరు టీకాలు( DPT+IPV+Hepatitis B+HIB+Pneumococcal+Rota virus) మళ్ళి ఇప్పుడు వేయాలి.ఇలా మూడు సార్లు వేయటం వలన వీటి పనితనం బాగా మెరుగుపడి పిల్లాడి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

Combination vaccines / కాంబినేషన్ టీకాలు: 

అంటే ఒకటికంటే ఎక్కువ రకాల టీకాలు కలిపి ఒకే ఇంజక్షన్లో జతపరచి ఇవ్వటం. వీటి వలన పిల్లలకి ఎక్కువ సూదులు వాడకుండా ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వగలుగుతాము.

Pentavalent vaccine (పెంటా వాలెంట్ టీకా)- DPT + Hepatitis B + HIB  ఇది ప్రభుత్వం ఇచ్చే టీకాలలో ఉంటుంది.

Hexaxim (హెక్సక్సిమ్ టీకా)- DaPT + Hepatitis B + HIP + IPV  ఇది మీ పిల్లల డాక్టరుగారు వద్ద లభిస్తుంది.

రెండొవ భాగం లో ఉండే వివరాలు:

1. ) ఆరు నెలల నుండి పెద్దయ్యే వరకు వేయించాల్సిన టీకాలు.

2. ) టీకాల వల్ల వచ్చే దుష్పరిణామాలను ఎలా గుర్తించాలి ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి.

3. ) ప్రతీ టీకా యొక్క ఖరీదు.

4. ) ఒక వేళ టీకా డోస్ మిస్ అయితే ఏం చేయాలి?

మీ బాబు/పాప టీకాల పట్టిక  ఎపుడూ జాగ్రత్తగా భద్రపరచుకోండి.  మీ బాబు/పాప టీకాల వివరాల కోసం  మీ పిల్లల డాక్టర్ గారిని సంప్రదించండి లేదా  89199 94819 కి డాక్టర్ గారి సలాహా  కోసం వాట్సాప్ చేయండి. ఈ విషయంలో ఇంకా సందేహాలు ఉంటె క్రింది కామెంట్స్ లో పెట్టండి, రెండొవ భాగంలో నివృత్తి చేస్తాను.

వ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.

 ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.

ఈ వ్యాసం లోని వివరాలు ఇండియన్ అకాడమీ అఫ్ పెడియాట్రిక్స్ (IAP) మరియు National Immunization Program  నుండి సేకరించబడినవి.https://iapindia.org/index.php.

క్రింద IAP Vaccination schedule  మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ టీకాల పట్టికలు జాతహపర్చబడినవి. I would like to Credit  Dr Jyothsna for helping me.

ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ MD(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో  ఫెలోషిప్(FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ chennai) చేసారు. 


Disclaimer: This document cannot be used for any medico-legal purpose.



Dr. Srinivas MD




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

How can we treat children who have symptoms of COVID a home?

ఆరు నెలలలోపు వయసున్న పిల్లలగురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. Important things to know while raising an infant(until 6 months of age).

పిల్లల్లో వాంతులు , విరోచనాలు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు . Suggestions on how to deal with the child when the child is having vomiting and loose stools.