ఆరు నెలలలోపు వయసున్న పిల్లలగురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. Important things to know while raising an infant(until 6 months of age).
పాపాయికి ఒక నెల వయసు నిండగానే ఒక ముఖ్యమైన మైలురాయి దాటినట్లు. తల్లిలో పాపను తాను చూసుకోగలననే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా చూడటానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు, సమస్యలు, సలహాలు తగ్గుతాయి. కాని కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఈ వయసులోనే మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులకు ఏది సహజం , ఏది ప్రమాదం, ఎప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళలో తెలుపటం కోసం ఈ వ్యాసం.
6 నెలలలోపు పిల్లలకు ఏది సహజం?
- ) ప్రతీనెలా అర కేజి నుండి కేజి వరకు బరువు పెరుగుతారు. ఐదు నెలలు నిండేసరికి పుట్టిన బరువుకి రెట్టింపు బరువవుతారు.
- ) తల్లి పాలు లేదా డబ్బా పాలు తాగిన తరువాత మూడు నుండి ఐదు గంటల వరకు పడుకుంటారు. ఒక వేళ గంట గంటకు లేచి ఏడుస్తుంటే పాలు సరిపొవట్లేదని అర్థం.
- ) నెల వయసు నుండి ఐదు నెలలల వయసు లోపు పిల్లలు ఒక్కొక్కసారి ఉన్నట్లుండి ఏడవటం మొదలు పెడతారు. గంట నుండి రెండు గంటలవరకు ఏడుస్తారు. అల ఏడుస్తున్నప్పుడు పొట్ట బిగుతుగా అనిపిస్తుంది. కొంత మంది పిల్లలు గుక్క తిప్పకుండా ఏడుస్తారు. ఇది సాధారణంగా సాయంత్రం వేళ నుండి అర్థరాత్రి మధ్యలో జరుగుతుంటుంది. ప్రతీ రోజూ అదే సమయానికి మళ్ళి ఏడుపు మొదలుపెడుతుంటారు. దీనినే ఈవెనింగ్ కోలిక్ లేదా Infantile colic అంటుంటారు. ఇది మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికీ తల్లి ఆహారానికి సంబంధం లేదు. ఇది వయసు తో పాటు తగ్గుతుంది. ప్రత్యేకంగా మందులు వాడాల్సినపని లేదు.
- ) ఈవయసులో పిల్లలు విరోచనం వెళ్ళే ముందు పాస్ పొసే ముందు ముక్కటం సహజం.
- ) విరోచనం రోజులో ఆరు నుండి పది సార్లు లేదా పాలుతాగినప్పుడల్లా వెళ్ళటం సహజం. కొన్ని సార్లు మూడు నుండి ఐదు రోజులకొకసారి విరోచనం అవ్వటం సహజం.
- ) వొళ్ళు మాటి మాటికీ విరుచుకోవటం ఆరోగ్యం గా ఉన్న పిల్లల లక్షణం, అలాగే ఎక్కువగా ఆవలించటం కూడా.
- ) తేన్పు రావటం, గాస్ పాస్ చెయ్యటం పిల్లలలో సహజం, అరుగుదల లేకపోవటం కాదు.
- ) కొంత మంది పిల్లలు పాలు తాగిన తరువాత కొంత కక్కుతుంటారు. ఇది ఒక్కోసారి పాల లాగా ఒక్కొక్క సారి విరిగిన పాల లాగా ఉంటుంది. పిల్లలు బరువు పెరుగుతున్నంత వరకూ ఈ వాంతులకు ఎలాంటి మందులు అవసరం లేదు.
- ) బయట వాతావరణం చల్లగా ఉన్నపుడు పిల్లల ఛాతీ మరియు వెన్నుమీద గుర్ గుర్ మని శబ్దం వినిపించటం సహజం. ఇది జలుబు లేదా నిమ్ము కాదు.
చెయ్యాల్సిన పనులు:
- ) పాలు తాగించిన తరువాత వెంటనే పడుకో పెట్టకుండా ఒక అరగంట భుజం మీద ఉంచుకోవటం.
- ) వీలైనంత వరకు తల్లి పాలు పట్టడానికి ప్రయత్నించటం. తల్లికి మంచి పోషణ ఉన్న ఆహరం ఇవ్వటం.
- ) సమయానికి టీకాలు వేయించడం.
- ) నెల నెలా బరువు చూపించి పెరుగుదల ఉందొ లేదో చూసుకోవటం.
- ) తల్లి పాలు సరిపోనీ లేదా ఇవ్వలేని పక్షం లో డాక్టరుగారు సూచించిన డబ్బాపాలు సారిగా కలిపి ఇవ్వటం.
- ) ఒక వేళ డబ్బా పాలు ఇస్తున్నట్లతే ప్రతీసారి డబ్బా మరియు పాలపీకను మరిగే నీటిలో కాసేపు ఉంచి సుబ్రపరిచినతరువాతే మళ్ళి వాడటం.
- ) ఆరొవ నెల వరకు కేవలం తల్లి పాలు లేదా డబ్బా పాలు మాత్రమే ఇవ్వటం.
- ) వీలైనంత వరకు జనం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లక పోవటం మరియు సందర్శకులను తగ్గించుకోవటం.
- ) రోజుకు ఒక్కసారి స్నానం చేయించడం, ముక్కు మరియు చెవుల లోకి నీరు పోకుండా జాగ్రత్తగా చేయించటం. స్నానం ఐదు నిముషాలలో పూర్తి చేయటం.
- ) వారానికి లేదా పక్షానికి ఒక్కసారే తలకు పొయ్యటం, మరియు వెంటనే తల ఆరబెట్టటం.
చెయ్యకూడని పనులు:
- ) రెండు గంటలకి ఒకసారి లేపి ఆకలి లేకుండా పాలు తాగించటం.
- ) డబ్బా పాలు చెప్పిన విధంగా కాకుండా పల్చగా కలపటం. ఇలా చేస్తే పిల్లలు బరువు పెరగరు.
- ) గెద పాలు , ఆవు పాలు పట్టించడం. ఇవి సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వకూడదు.
- ) పిల్లల్లో అనాసలు ఉంటాయనుకోవటం ఒక మూఢ నమ్మకం.వాటి కోసం మందులు వాడటం ప్రమాదకరం. కానీ ఎంతో మంది చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఇవి నమ్మడం నాటు మందులు ఇవ్వటం చూసాను. ఇలాంటి మందుల వలన ప్రాణాలు కోల్పోయిన పిల్లల్ని ప్రతీ పిల్లల వైద్యుడూ తమ అనుభవం లో చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటివి నమ్మి మీ పిల్లల ప్రాణానికి హాని కలిగించకండి.
- ) విరేచనం అవ్వటం కోసం ఆముదం పట్టటం. ఇది ఒక్కో సారి పిల్లల ప్రాణానికే ప్రమాదం అవుతుంది.
- ) విరోచనం అవ్వటం కోసం సబ్బు పెట్టటం. దీని వల్ల పిల్లల ముడ్డి ఒరిసి రక్తం వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ) తేనె పీక నోటిలో పెట్టటం. దీనివలన విరోచనాలు అయ్యే అవకాశం ఎక్కువ.
- ) సాంబ్రాణి పొగ పెట్ట కూడదు. పిల్లలు ఒక్కొక్కసారి శ్వాస అందక ఉక్కిరి బిక్కిరి అవుతారు.
- ) ముక్కు మరియు చెవులలో నూనె పొయ్య కూడదు. ఇది ప్రమాదకరమైన పద్దతి.
- ) ప్రతీ రోజూ నలుగు పెట్టటం మంచిది కాదు. చర్మం లో సహజంగా ఉండే నూనె(oil and moisture) పోవటం వలన దద్దురు రావచ్చు.
- ) కళ్ళలో కాటుక పెట్టటం వలన కళ్ళు పెద్దవవుతాయి అనుకోవటం అపోహ. కాటుక వలన పిల్లలు ఎక్కువ ఏడుస్తారు మరియు కంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
- ) Gripe water మీ పిల్లలకు ఇవ్వకూడదు. VICKS రాయకూడదు.
- ) ఆరొవనేల రాకుండా అన్నం లేదా సెరిలాక్ పెట్టటం.
- )తల్లికి జ్వరం లేదా నలతగా ఉందని పాలు త్వరగా మాన్పించటం.
ఎప్పుడు పిల్లల డాక్టర్ గారి దగ్గరకు వెంటనె తీసుకెళ్లాలి?
- ) బిడ్డ పాలు తాగటానికి అస్సలు ఆసక్తి కనబరచకాపోతే.
- ) బాగా మగతగా ఉంటే.
- ) ఆరు నెలల లోపు పిల్లలలో జ్వరం వస్తే.
- ) ఆరు గంటలో కనీసం ఒక్కసారి కూడా పాస్ పొయ్యకపోతే.
- ) పాలు తాగిన ప్రతీ సారీ ఎక్కువగా వాంతు చేసుకుంటుంటే.
- ) ఫిట్స్ లేదా కళ్ళు తేలవేసినట్లు అనిపిస్తే.
- ) ఆయాసపడుతున్నట్లు కాని పక్కలు ఎగరేస్తున్నట్లు కాని అనిపిస్తే.
- ) గుక్కతిప్పకుండా గంటకు మించి ఏడుస్తూ ఉండటం.
- ) పిల్లడు నీలం రంగులోకి మారడం.
- ) ప్రతీనెలా పెరగాల్సినంత బరువు పెరగకపోతే.
- ) ఐదు రోజులకు మించి విరోచనం వెళ్ళకపోతే
- ) చెవిలోనుండి చీము కారుతుంటే.
ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ Rekapalli MD FNB(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్( FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ KKCTH chennai ) చేసారు.
Disclaimer: This document cannot be used for any medico-legal purpose.
Verygood sir great job
రిప్లయితొలగించండిGood msg sir
Good information sir .mee hard work ki hat's off sir
రిప్లయితొలగించండి