పిల్లల్లో వాంతులు , విరోచనాలు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు . Suggestions on how to deal with the child when the child is having vomiting and loose stools.
పిల్లల్లో జ్వరం తరువాత తరచుగా వచ్చే సమస్య వాంతులు లేదా విరోచనాలు అవ్వటం. రోటా వైరస్ వాక్సిన్ వచ్చిన తరువాత మరియు స్వచ్ఛమైన త్రాగు నీరు అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య మునుపటి మీద తగ్గగిన మాట నిజం. సాధారణంగా మొదటి ఐదు సంవత్సరాల వయసులో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది మరియు చిన్నపిల్లల్లో ఇది ప్రాణాంతకం కూడా. పిల్లలలో విరోచనాలు లేదా వాంతులు మొదలయ్యాక ఎం చెయ్యాలో, ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళల్లో ఈ వ్యాసంలో వివరిస్తాను.
పిల్లల్లో విరోచనాలు వాంతులు అవ్వటానికి కారణాలు:
1.) శుభ్రంగా లేని ఆహారం తినటం లేదా నీరు తాగటం.
2.) పాల డబ్బాతో పాలు తాగటం.
3.) క్రింద పడిన వస్తువులు నోట్లో పెట్టుకోవడం.
4.) చేతులు సుబ్రంచేసుకోకుండా ఆహరం తినటం లేదా తినిపించడం.
5.) నిల్వ ఉన్న ఆహరం లేదా బయటనుండి తెచ్చిన ఆహరం తినటం.
6.) పళ్ళు వస్తున్నప్పు విరోచనాలు అవ్వటం సహజం అనుకోవటం ఒక అపోహ. ఆ వయసులో పిల్లలు అన్ని వస్తువులూ నోట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్ మరియు విరోచనాలు కావచ్చు.
లక్షణాలు:
1.) ఒకటికి మించి వాంతులు అవ్వటం.
2.) విరోచనం బాగా పల్చగా నీరు లాగ వెళ్ళటం. బాగా చెడు వాసన రావటం.
3.) ముడ్డి చుట్టూ వొరుపు రావటం, ఎర్రగా మారడం.
4.) జ్వరం రావటం.
సమస్య మొదలవగానే మీ పిల్లల వైద్యునికి చూపించాలి. డాక్టర్ గారు పరీక్షించి నోటి మందులు సరిపోతాయో లేదా సెలైన్ పెట్టాలో నిర్ణయిస్తారు. ఒక సారి మొదలయ్యాక విరోచనాలు మూడు నుండి నాలుగు రోజులపాటు అవుతాయి.
ఇంటిలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
1.) ద్రవపదార్దాలు ఎక్కువగా తాగించటం.
2.) ఉప్పు వేసిన పల్చటి మజ్జిగ, సగ్గుబియ్యం జావ, ఓ ర్ ఎస్(ORS) , కొబ్బరి నీరు, గంజి ఎక్కువగా ఇవ్వాలి.
3.) ఒక వేళ పాప తల్లి పాలు లేదా డబ్బా పాలు తాగుతుంటే అవి కొనసాగించాలి.
4.) పాప లేదా బాబు ప్రతీ నాలుగు నుండి ఆరుగంటలకు ఒకసారైనా పాస్ పూస్తున్నాడో లేదో గమనించాలి.
5.) ఆహారం ఆపకూడదు, అలాగని బలవంతంగా పెట్టకూడదు. కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తినిపించాలి.
6.) డాక్టర్ గారు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వేయాలి. ఒక వేళ మందు వేసిన ముప్పై నిముషాలలో కక్కితే మందు మళ్ళి వెయ్యాలి. ఏ మందైనా ఇచ్చిన మోతాదుని అంతే మొత్తంలో నీళ్లు లేదా పాలలో కలిపి వెయ్యవచ్చు.
7.) ఒకవేళ డైపర్ వాడుతుంటే విరోచనం అయిన ప్రతీ సారీ మార్చాలి. డైపర్ rash క్రీమ్ తరచుగా పూయాలి.
8.) విరోచనం అయిన ప్రతీ సారి తాగగలిగినంత ORS తాగించాలి.
9.) ORS ఎప్పుడూ ప్యాకెట్ మీద సూచించిన విధంగానే కలపాలి. రెండు రకాల పాకెట్స్ లభ్యమౌతాయి ఒకటి లీటర్ నీటిలో కలిపేది మరొకటి 2౦౦ మిల్లీలీటర్స్ నీటిలో కలిపేది. సర్రిగ్గా చూడకుండా కలిపితే అది కూడా ప్రమాదమే.
చెయ్యకూడని పనులు:
1.) డాక్టర్ గారిని సంప్రదించకుండా మెడికల్ షాప్ కి వెళ్లి మందులు అడిగి తేవటం, దీని వలన డోస్ ఎక్కువ అయ్యి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అనవసరం గా antibiotics వాడటం వలన సమస్య పెరుగుతుంది.
2.) ఆహరం లేదా పాలు పూర్తిగా ఆపెయ్యటం, ఇలా చేస్తే నీరసం మరింత పెరిగి శరీరం లో నీటి శాతం తగ్గిపోతుంది(dehydration and hypoglycemia).
3.) విరోచనమైన ప్రతీ సారీ Wipes తో లేదా గుడ్డ తో శుభ్రం చేయటం. ఇలా చెయ్యటం వలన ముడ్డి ఒరిసిపోతుంది. కేవలం నీతితో మాత్రమే శుభ్రపరచాలి.
4.) కేవలం మంచి నీళ్లే పట్టించటం లేదా గ్లూకోస్ కలిపిన నీళ్లు పట్టించటం. కూల్ డ్రింక్స్ పట్టించకూడదు.
ప్రమాదకరమైన లక్షణాలు , ఎప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి(signs of dehydration)?
1.) పిల్లవాడు బాగా నీరసంగా ఉంటే.
2.) నోరు తడి ఆరినట్లు, పిడచకట్టినట్లు కనిపిస్తోంటే.
3.) ఆరు గంటలపాటు పాస్ పొయ్యకపోతే.
4.) విరోచనం లో రక్తం లీడ ఎర్రదనం కనిపిస్తే.
5.) డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసాక కూడా వాంతులు ఆగకపోతే.
6.) కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటే.
7.) జ్వరం వస్తే.
8.) కడుపు నొప్పి వస్తోంటే.
9.) కళ్ళు లోతుకు పోయినట్లు అనిపిస్తుంటే.
10.) మూడు నెలల లోపు పిల్లలకు విరోచనాలు వాంతులు అవుతుంటే.
ఈ పరిస్థితుల్లో త్వరగా సెలైన్ పెట్టటం ప్రాణాలని కాపాడుతుంది.
నివారణ:
1.)సంవత్సరం లోపు పిల్లలకు తల్లిపాలు ప్రోత్సహించటం,మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలనే ఇవ్వటం.
2.)తల్లి పాలు సరిపోనీ లేదా ఇవ్వలేని పక్షం లో డాక్టరుగారు సూచించిన డబ్బాపాలు సారిగా కలిపి ఇవ్వటం.
3.) ఒక వేళ డబ్బా పాలు ఇస్తున్నట్లతే ప్రతీసారి డబ్బా మరియు పాలపీకను మరిగే నీటిలో కాసేపు ఉంచి సుబ్రపరిచినతరువాతే మళ్ళి వాడటం.
4.) మీ పిల్లలకు Rota virus టీకా తప్పక వేయించండి.
5.) ఇంట్లో వండిన వస్తువులనే పిల్లలు తినటానికి ఇవ్వండి. ఏ పూట వండిన ఆహరం ఆ పూటే పెట్టాలి.
6.) ఆహారం పెట్టే ముందు తల్లి మరియు పిల్లాడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
7.) చేతి గోర్లు వారం వారం తీసేస్తూ ఉండాలి.
8.) సంవత్సరం వయసు తరువాత కేవలం గ్లాసుతో మాత్రమే పాలు అలవాటు చేయాలి. డబ్బా పాలు ఎట్టి పరిస్థితుల్లో మాన్పించాలి.
పిల్లల విషయం లో ఆలస్యం అస్సలు మంచిది కాదు. మీ పిల్లల డాక్టర్ గారిని వెంటనే సంప్రదించండి. అత్యవసర సమయం లో మీ డాక్టరుగారికి కానీ 108 కి కానీ కాల్ చేయటానికి సంకోచించకండి. లెదా 89199 94819 కి డాక్టర్ గారి సలాహా కోసం వాట్సాప్ చేయండి. వ్యాసంలో తెలుపపడిన వివరాలు కేవలం తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎల్లప్పుడూ మీ బాబుని లేదా పాపని చూస్తున్న డాక్టరుగారి సలహాని అనుసరించండి.
ఈ వ్యాసంలో లో విషయాలు డాక్టర్లు అందరూ చెప్పేవే కాని తల్లిదండ్రుల వీలుకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి.
ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ Rekapalli MD FNB(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్( FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ KKCTH chennai ) చేసారు.
Disclaimer: This document cannot be used for any medico-legal purpose.
Verygood sir great job
రిప్లయితొలగించండి