నెల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు. Essential information for parents of a new born baby.
ఇంట్లో బాబు లేదా పాపాయి పుట్టగానే ఎంతో ఆనందంతో పాటు ఎన్నో సంశయాలు ఉంటాయి. మొదటి సారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కంగారు మరింత ఉంటుంది. అది సహజం. ఇంట్లో పెద్ద వారు, పుట్టిన బిడ్డను చూడటానికి వచ్చినవారు తోచిన సలహాలు చెప్తుంటారు. వాటిలో ఏది నమ్మాలో ఏది అనుసరించాలో తెలియక తల్లిదండ్రులు మరింత భయపడతారు. అలాంటి తల్లిదండ్రుల వీలు కోసం ఈ వ్యాసం లో క్లుప్తంగా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో , ఎప్పుడు వెంటనే డాక్టర్ గారిని కలవాలో చెప్తాను.
నెలలోపు పిల్లలకు ఏది సహజం?
- ) పుట్టిన పిల్లల బరువు సాధారణంగా 2.5 కిలోల నుండి 4 కిలోలవరకు ఉంటుంది. మొదటి వారం పుట్టిన బరువులో పది శాతం తగ్గడం సహజం. పుట్టిన 10 రోజులకు పుట్టిన బరువుని మళ్ళి చేరుకుంటారు. ఆ తరువాత మూడు నెలల వరకు వారానికి 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరుకు పెరుగుతుంటారు అంటే నెలకు ముప్పావు కేజీ నుండి ఒక కిలో పెరుగుతారన్నమాట.
- ) బాబు లేదా పాప కి తల్లి పాలు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి. సాధారణ కాన్పు అయితే వెంటనే మొదలు పెట్టచ్చు. సిసేరిన్ కాన్పు అయితే తల్లికి కొంచం ఓపిక రాగానే రొమ్ముపాలు మొదలుపెట్టాలి.
- ) పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా రొమ్ము పట్టిస్తూ ఉండాలి. అప్పుడే పాలు త్వరగా వస్తాయి. రాత్రిపూట కూడా ఇలాగే చెయ్యాలి. పిల్లాడిని తల్లికి దగ్గరిగా ఉంచితే మంచిది.
- ) మూడొవరోజుకి కాని తల్లిలో పూర్తిగా పాలు రావు. కానీ అప్పటివరకు నెలలు నిండి సరైన బరువు పుట్టిన బిడ్డకు వచ్చినన్ని పాలే పిల్లలకు సరిపోతాయి బయటి పాలు పట్టాల్సిన అవసరం ఉండదు.
- ) మొదట వచ్చే పాలను ముర్రుపాలు లేదా colostrum అంటారు. వీటిలో పిల్లల ఆరోగ్యానికి మరియి రోగనిరోధక శక్తికి అవసరమైన ఎన్నో పదార్థాలు ఉంటాయి. వీటిని తప్పక పుట్టిన బిడ్డకు అందించండి.
- ) పుట్టిన 24 గంటల లోపు పిల్లలు మొదటి సారి విరోచనం(meconium) వెళ్ళాలి. 48 గంటలలోపు మొదటి సారి పాస్ పొయ్యాలి. విరోచనం మొదటి మూడు రోజులు నల్లగా ఉంటుంది తరువాత పచ్చగా మారి వారం రోజులకి పసుపు రంగు వస్తుంది.
- ) పుట్టిన పిల్లలు రోజులో ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. రోజుకి 16 నుండి 20 గంటల వరకు పడుకుంటారు. పగటి పూట ఎక్కువ పడుకొని రాత్రి పూట లేచి ఉంటారు. పగలు రాత్రి తేడా తెలియటానికి మూడు నెలల వయసు రావాలి.
- ) కొంతమంది పిల్లలు పాలు తాగిన ప్రతీ సారి విరోచనం వెళ్తుంటారు. ఇది సహజం. కొంతమంది పిల్లలు మూడు లేదా నాలుగు రోజులకొకసారి వెళతారు, ఇది కూడా సహజమే.
- ) అరవై శాతం మంది పిల్లలకి పుట్టిన వారం రోజులలో పుట్టు కామెర్లు రావటానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల పిల్లాడి కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. కొంతమంది పిల్లలలో తీవ్రత ఎక్కువ గా ఉండి వైద్యం చేయవలసి ఉంటుంది. కళ్ళు పచ్చదనం పోవటానికి నెల రోజుల వరకూ సమయం పడుతుంది.
- ) చర్మం మీద ఎర్రటి మచ్చలు రావటం, పొట్టమీద నరాలు(tiny blood vessels) కనిపించటం నెల రోజులలోపు పిల్లలలో సహజం. ఇవి వయసు తో పాటు తగ్గుతాయి.
- ) పుట్టిన పిల్లల్లో వెక్కిళ్ళు రావటం, తుమ్ములు రావటం సహజం. దీనికి ప్రత్యేకంగా వైద్యం అవసరం లేదు.
- ) బొడ్డు తాడు(umbelical cord) పుట్టిన మూడు నాలుగు రోజులలో ఎండుతుంది. పుట్టిన రెండు వారాలలో(2 weeks/15days) ఊడుతుంది. ఊడిన తరువాత ఆ ప్రాంతం పచ్చిగా లేదా ఎర్రగా కనిపిస్తుంది. కొన్ని రోజులకి దానంతట అదే మానిపోతుంది. దాని మీద డాక్టర్ గారి సలహా లేకుండా ఎటువంటి మందులు రాయకూడదు.
- ) ఆడపిల్లల్లో పుట్టిన మొదటివారం లో జననేంద్రియం(vagainal bleeding/discharge) నుండి ఒక్కొక్కసారి తెల్లటి,ఒక్కోసారి ఎర్రటి స్రావం జరగొచ్చు. ఇది సహజంగా తల్లి నుండి వచ్చిన హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతుంది. ఇది చూసి చాలా మంది కంగారు పడుతుంటారు.ఇది సహజమని గుర్తించండి.
- )పసి పిల్లల్లో చనుమొనలు(nipples) కొద్దిగా ఉబ్బినట్లు ఉండటం కూడా తల్లి ద్వారా వచ్చిన హార్మోన్ల ప్రభావమే. వయసు పెరిగేకొద్దీ తగ్గుతాయి.
- ) వొంటి మీద, ముఖఃము మీద పేలుడు పొక్కులు(milia) లాగా రావటం సహజం. వాటంతట అవే తగ్గుతాయి.
- ) పిల్లలు పుట్టినప్పటి నుండి నెల రోజులు వచ్చేసరికి కొంత రంగు మారతారు. సబ్బు లేదా నలుగుతో సంబంధం లేదు. రంగు అనేది జన్యుపరంగానే(genetic) వస్తుంది.
- ) తాగిన పాలలో కొంత కక్కడం సహజం. పాలు పట్టిన తరువాత అరగంట సేపు భుజం మీద ఎత్తుకోవటం మంచి అలవాటు.
- ) మూడోవ రోజు నుండి రోజుకు ఆరు సార్లు నుండి ఇరవై సార్లు మూత్రం పోస్తారు.
- ) పాస్ పొసే ముందు కాని పోస్తున్నప్పుడు కాని పసి పిల్లలు ఏడవటం సహజం, కంగారు పడకండి.
చెయ్యకూడని పనులు:
- )పసిపిల్లల్లో అనాసలు ఉంటాయనుకోవటం ఒక మూఢ నమ్మకం.వాటి కోసం మందులు వాడటం ప్రమాదకరం. కానీ ఎంతో మంది చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఇవి నమ్మడం నాటు మందులు ఇవ్వటం చూసాను. ఇలాంటి మందుల వలన ప్రాణాలు కోల్పోయిన పిల్లల్ని ప్రతీ పిల్లల వైద్యుడూ తమ అనుభవం లో చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటివి నమ్మి మీ పిల్లల ప్రాణానికి హాని కలిగించకండి.
- ) పుట్టగానే తల్లి పాలు కాకుండా వేడి నీళ్లు లేదా పంచదార నీళ్లు పట్టించటం ప్రమాదం. ఇలా చేయటం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు మరియు తల్లి పాలు త్వరగా పడవు.
- ) పుట్టిన పిల్లలకు తేనె నాకించటం. సంవత్సరాల లోపు పిల్లలకు తేనే ప్రమాదకరం(infant botulism). అస్సలు ఇవ్వకూడదు.
- ) బొడ్డు తాడు కి ఎటువంటి మందులు లేదా పసరలు రాయకూడదు. వీటివల్ల బొడ్డుకి ఇంఫెక్టన్ వచ్చి వొళ్ళంతా పాకచ్చు( umbilical sepsis).
- ) స్నానం చేయించేటప్పుడు ముక్కు మరియు చెవులలోకి నీళ్లు వెళ్లకుండా చేయించాలి.
- ) సాంబ్రాణి పొగ పెట్ట కూడదు. పిల్లలు ఒక్కొక్కసారి శ్వాస అందక ఉక్కిరి బిక్కిరి అవుతారు.
- ) ముక్కు మరియు చెవులలో నూనె పొయ్య కూడదు. ఇది ప్రమాదకరమైన పద్దతి.
- ) ప్రతీ రోజూ నలుగు పెట్టటం మంచిది కాదు. చర్మం లో సహజంగా ఉండే నూనె(oil and moisture) పోవటం వలన దద్దురు రావచ్చు.
- ) పసి పిల్లలను ఎండలో పెట్టడం వలన కళ్ళకు హాని జరిగే అవకాశం ఉంటుంది. కామెర్లు ఎక్కువ ఉంటె హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలి తక్కువగా ఉంటే పిల్లల్లో సహజం గానే తగ్గుతాయి, కాబట్టి మీ పిల్లల డాక్టర్ సూచనలు అనుసరించండి.
- )పసిపిల్లలో కామెర్లకి నాటు మందులు వాడకండి. అవి ప్రాణానికే ప్రమాదం.
- ) పసుపు పెట్టడం వలన పిల్లల్లో కామెర్లు వస్తే తెలుసుకోవటం కష్టం. పసుపు పెట్టకండి.
- ) కళ్ళలో కాటుక పెట్టటం వలన కళ్ళు పెద్దవవుతాయి అనుకోవటం అపోహ. కాటుక వలన పిల్లలు ఎక్కువ ఏడుస్తారు మరియు కంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
- ) తల్లి పాలు లేని పక్షం లో మీ డాక్టర్ గారిని అడిగి సరియైన డబ్బా పాలనే ఇవ్వాలి. అది కూడా సూచించిన విధంగానే నీళ్లు కలిపి ఇవ్వాలి. బాగా చిక్కగా పడితే అరగవు, పల్చగా పడితే బరువు పెరగారు.
- ) గేదె పాలు లేదా ఆవు పాలు పసిపిల్లల్లో అరగవు, ఇవ్వకూడదు.
- ) పిల్లల విరోచనానికి తల్లి ఆహారానికి సంబంధం లేదు. తల్లికి మంచి పౌష్టికాహారం పెడితేనే మంచి పాలు వస్తాయి.
- ) Gripe water మీ పిల్లలకు ఇవ్వకూడదు.
ఎప్పుడు పిల్లల డాక్టర్ గారి దగ్గరకు వెంటనె తీసుకెళ్లాలి?
- ) బిడ్డ పాలు తాగటానికి అస్సలు ఆసక్తి కనబరచకాపోతే.
- ) బాగా మగతగా ఉంటే.
- ) పసిబిడ్డలో జ్వరం వస్తే.
- ) ఆరు గంటలో కనీసం ఒక్కసారి కూడా పాస్ పొయ్యకపోతే.
- ) పాలు తాగిన ప్రతీ సారీ వాంతు చేసుకుంటుంటే.
- ) బొడ్డు చుట్టూ ఎర్రగా వస్తే.
- ) ఫిట్స్ లేదా కళ్ళు తేలవేసినట్లు అనిపిస్తే.
- ) ఆయాసపడుతున్నట్లు కాని పక్కలు ఎగరేస్తున్నట్లు కాని అనిపిస్తే.
- )గుక్కతిప్పకుండా గంటకు మించి ఏడుస్తూ ఉండటం.
- )పిల్లడు నీలం రంగులోకి మారడం.
- )పసిపిల్లలో వచ్చే కామెర్లకు తప్పకుండా డాక్టర్ గారి సలహా తీసుకోవాలి.
- )నెల నిండేసరికి బరువు పెరగక పోతే.
ఈ వ్యాస రచయిత, డాక్టర్ శ్రీనివాస్ Rekapalli MD FNB(ఆంధ్ర మెడికల్ కాలేజీ/ KGH) , పిల్లల వైద్యం లో 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు మరియు పిల్లలలో అతితీవ్రమైన జబ్బులకు ICU లో వైద్యం చేయటంలో ఫెలోషిప్( FNB కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ KKCTH chennai ) చేసారు.
Disclaimer: This document cannot be used for any medico-legal purpose.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి